విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించి నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది భక్తులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేశారు. అలాగే ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నారా లోకేష్.. ఈ సమస్యపై తక్షణమే స్పందిస్తారని, పరిష్కారం చూపిస్తారనే ఉద్దేశంతో కొంతమంది ఎక్స్ యూజర్లు.. ఈ వీడియోను తమ ఎక్స్ అకౌంట్ ద్వారా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో యూజర్ల ట్వీట్‌కు నారా లోకేష్ స్పందించారు. వారికి క్షమాపణలు చెప్పారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి నిత్యం జనం భారీగా తరలివస్తుంటారు. అయితే దుర్గ గుడిలో తాగునీటి సమస్య ఉందంటూ.. ఈ విషయాన్ని కొంతమంది భక్తులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద తాగునీరు అందుబాటులో లేదని.. నిర్వహణ కూడా సరిగా లేదంటూ నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అందుకు జత చేశారు. అసలు విజయవాడ దుర్గ గుడికి ఈవో ఉన్నారా అంటూ భక్తులు ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితిని చూడటం చాలా దురదృష్టకరమని పేర్కొంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ను కోరారు.
మంత్రి నారా లోకేష్ ఈ ట్వీట్‌కు స్పందించారు. విజయవాడ దుర్గ గుడి భక్తులకు క్షమాపణలు చెప్పారు. తాగు నీటి సమస్యపై భక్తులందరికీ క్షమాపణలు చెప్తున్నానంటూ ట్వీట్ చేశారు. తాగు నీటి సమస్యను గుర్తించి ఇప్పటికే సంబంధిత శాఖకు తెలియజేశామని నారా లోకేష్ బదులిచ్చారు. ఇలాంటి తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటామంటూ హామీ ఇచ్చారు. మరోవైపు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారానికి కృషి చేస్తుంటారు నారా లోకేష్. అలాగే ఆన్ లైన్లోనూ యాక్టివ్‌గా ఉంటూ తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ సమస్యలను నెటిజన్లు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువస్తున్నారు. ఇక తన దృష్టికి వచ్చే సమస్యలపై సదరు శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ.. వాటి పరిష్కారానికి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గ గుడిలో తాగునీటి సమస్యపైనా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.