ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి ఉద్యోగుల కేసులు పెండింగ్‌లో ఉండటంపై ఆయన కన్నెర్ర జేశారు. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో.. వాటి వివరాలేంటో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పనితీరుపై సునిశితమైన విజిలెన్స్ ఉండాలని పవన్ స్పష్టం చేశారు. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు.ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపుతుందన్నారు పవన్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, అందుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం తెలుసుకుని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని కారణంగా అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేదన్నారాయన. విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని ఆదేశించామని పవన్ తెలిపారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.