ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో అరెస్ట్ అయిన కామేపల్లి తులసి బాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఇందులో తమను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలని రఘురామ కృష్ణంరాజు వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. ఆర్‌ఆర్‌ఆర్ ఇంప్లీడ్ పిటిషన్ తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. తులసి బాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.రఘురామ కృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ చేసిన వ్యవహారంలో అతనికి సంబంధం లేదని, దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ కూడా ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందని తులసి బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. తులసిబాబు పోలీసు కస్టడీలో ఎటువంటి వివరాలు వెల్లడించలేదని, అందువల్ల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ప్రస్తుతం సెషన్స్ కోర్ట్‌లో పెండింగ్‌లో ఉందని చెప్పారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ ఉందని కోర్ట్‌కు వివరించారు. ఈ క్రమంలో ఈ కేసును సోమవారానికి (జనవరి 20)కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో ఈకేసు విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.