ప్రజలు కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇబ్బంది పడకుండా వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి ‘‘మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం’’ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ(గురువారం) నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనుంది. మానవ వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాట్సాప్ గవర్నెన్స్ ఎలా పని చేస్తుందో నారా లోకేష్ వివరించారు.వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు, రెండో విడతలో 360 రకాల సేవలను వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇందుకోసం 9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ సూచించారు.