by Suryaa Desk | Tue, Oct 15, 2024, 09:01 PM
తెలుగు సినీ పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ సమస్యలు ఉన్నాయి. సినిమా రంగాన్ని బతికించడానికి... చిన్నసినిమాలకు మేలు జరగడానికి సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని సినీ పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంది. ఈ అంశాన్ని పరిశీలించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంథి విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పవన్‌కల్యాణ్‌తో ఆయన సమావేశమయ్యారు. పూర్ణా పిక్చర్స్ 100 సంవత్సరాల సావనీర్ ప్రతిని పవన్‌కల్యాణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ “ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా ప్రేక్షకులకు ఇబ్బందికరమే. టిక్కెట్ల రేట్లు తమకు అందుబాటులో లేవనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోంది. సినీ పరిశ్రమను బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే అందరికి అనుకూలంగా ఉంటుంది. దీనిపై ఆలోచన చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారు. చిన్న బడ్జెట్ సినిమాలకు ఈ విధానం వల్ల కొంత మేలు జరుగుతుది. ఓటీటీ ప్రభావంతో సినిమాలకు దూరమైన ప్రేక్షకులు కూడా ఈ విధానం వల్ల సినిమా థియేటర్స్‌కు వస్తారు. దీని వల్ల చిన్న పెద్ద అన్ని స్థాయి చిత్రాలకు మేలు కలుగుతుంది” అని ఆయన వివరించారు. ఈ సూచనలు విన్న పవన్‌కల్యాణ్ సానుకూలంగా స్పందించి ఈ వివరాలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని తెలియజేశారు.
Latest News