by Suryaa Desk | Wed, Jan 08, 2025, 11:41 AM
సంధ్య థియేటర్ ఘటనపై నాగబాబు కుమార్తె నిహారిక తొలిసారి స్పందించారు. ప్రస్తుతం ఆమె ‘మద్రాస్ కారన్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న నిహారిక థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ.. ఆ ఘటన తనని ఎంతో బాధించిందని, ఇలాంటివి ఎవరూ ఊహించలేరని అన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఈ సంఘటనల నుంచి కోలుకుంటున్నారన్నారు. కాగా మద్రాస్ కారన్ మూవీ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.అనంతరం తమ కుటుంబ హీరోల గురించి ఆమె మాట్లాడారు. ‘‘వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్లోవాళ్ల సూచనలు, సలహాలు తీసుకుంటా. కథల ఎంపికల విషయంలో గందరగోళానికి గురైనప్పుడు.. మా అన్న వరుణ్‌తేజ్‌ను సంప్రదిస్తా. ఆయన సలహాలు తీసుకుంటా. నేను ఏ సినిమా ఓకే చేసినా కూడా.. దానిగురించి అన్నతోనే ఎక్కువగా డిస్కస్ చేస్తా. రామ్‌చరణ్ అన్నతో నేనెంతో సరదాగా ఉంటా. అన్నని ఎక్కువగా ఆట పట్టిస్తుంటా. ఇంటర్వ్యూల్లో ఏవిధంగా మాట్లాడాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకుంటా. లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సినిమాకు ఆయన స్టైల్ మారుస్తుంటారు. ఆవిధంగా ఆయన నుంచి స్ఫూర్తి పొందుతా’’ అని నిహారిక తెలిపారు.
Latest News