by Suryaa Desk | Mon, Jan 06, 2025, 04:29 PM
నటి హనీ రోజ్ తాజాగా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా వేదికగా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ ఆదివారం ఆమె పోస్ట్ పెట్టారు.దీంతో సోమవారం ఉదయం కేరళలోని ఎర్నాకుళం నగర పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు. అందులో కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.వివరణాత్మక విమర్శలను తాను స్వీకరిస్తానని తెలిపారు హనీరోజ్. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ''వివరణాత్మక విమర్శలు, నా లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను నేనూ స్వాగతిస్తా. వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ, దానికంటూ ఒక హద్దు ఉంటుందని నమ్ముతున్నా. అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించను. అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. వారిపై నా యుద్ధం ప్రకటిస్తున్నా. నాకోసం మాత్రమే కాదు మహిళలందరి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నా'' అని పేర్కొన్నారు.ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ ఆదివారం సాయంత్రం హనీరోజ్ ప్రకటన విడుదల చేశారు. "ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడు. నేను సైలెంట్‌గా ఉంటుంటే 'ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా?' అని చాలామంది అడుగుతున్నారు. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. వేర్వేరు కారణాల వల్ల వెళ్లేందుకు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు'' అని ఆమె తెలిపారు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. 'వీరసింహారెడ్డి'తో హనీరోజ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే.
Latest News