by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:44 PM
తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె నటి, రచయిత, దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. జనవరి రెండో తేదీ ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆమె మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తర్వాత పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఓటీటీలు ఇంకా రాకముందే చేసిన ఆ సిరీస్ యూట్యూబ్ లో అందుబాదులో ఉంది. దానికి మంచి అప్లాజ్ దక్కింది. తర్వాత రెండేళ్ల క్రితం ఆమె పెళ్లికూతురు పార్టీ అనే సినిమా చేశారు. తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన ఆమె అప్పటినుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.అయితే మొదట ట్రీట్మెంట్ కి బాడీ సహకరించినా తర్వాత ఆ ట్రీట్మెంట్ పనిచేయలేదని, క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కన్నుమూసినట్లు చెబుతున్నారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు తెరమీదకు రావడానికి ఆమె కృషి చాలా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఎంతోమంది నటులకు సినీ అవకాశాలు రావడానికి దర్శకులకు దర్శకత్వ అవకాశాలు రావడానికి ఆమె కారణమయ్యారని తెలుస్తోంది. ఎంతోమంది దర్శకులను నిర్మాతలను కూడా ఆమె కలిపి ప్రాజెక్టులు పట్టాలెక్కించేవారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు ఆమె డైరెక్షన్లో మెళుకువలు కూడా విద్యార్థులకు నేర్పించేవారు. అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొన్నట్లయింది.
Latest News