by Suryaa Desk | Wed, Jan 01, 2025, 12:16 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజులగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా హుషారుగా జరుగుతోంది. అయితే... సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది? అని అటు మహేష్ బాబు, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్...
జనవరి 2వ తేదీ, గురువారం నాడు పూజా కార్యక్రమాలతో మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం పది గంటలకు ఓపెనింగ్ జరుగుతుంది. సాధారణంగా తన సినిమా ఓపెనింగులకు మహేష్ బాబు హజరు కారు. మరి ఈ సినిమా కోసం వస్తారా? లేదా? అనేది చూడాలి. చిత్రసీమలో ప్రముఖులు కొందరితో పాటు సుమారు వంద మందికి పైగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా చిత్రీకరణలో కొంత భాగం అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశారు. ఆ సమయంలోను రాజమౌళి ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేశారు. బాహుబలి కోసం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ చేసినప్పుడు తన ఆఫీసును అక్కడే ఏర్పాటు చేశారు రాజమౌళి. ఇప్పుడు కూడా అంతే... అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు సినిమా షూటింగ్ కొంత చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు ఏడాదిగా అక్కడ ఈ సినిమా పనులు చేస్తున్నారు.