by Suryaa Desk | Tue, Dec 31, 2024, 05:50 AM
సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, నటుడు శ్రీ సింహా వివాహం ఇటీవల వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహం గురించి మురళీమోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ పెళ్లి విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తనకు ఎంతో కాలం నుంచి తెలుసని అన్నారు. ‘‘రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ నాకు క్లాస్‌మేట్. రాజమౌళి, కీరవాణి చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి వారిద్దరూ కారణం. రాజమౌళి తనయుడు కార్తికేయకు వి.బి.రాజేంద్ర ప్రసాద్ మనవరాలు పూజాకు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పూజా, మా మనవరాలు రాగ మంచి ఫ్రెండ్స్.
పూజా పెళ్లి తర్వాత కూడా అదే అనుబంధం కొనసాగింది. వీలు కుదిరినప్పుడల్లా మా మనవరాలు వాళ్లింటికి వెళ్తుండేది. వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు రాగకు బాగా నచ్చాయి. చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబాలంటే తనకు ఎంతో ఇష్టం. అలా, మా మనవరాలు ఆ కుటుంబాన్ని ఇష్టపడింది. తనే ఒక రోజు ప్రపోజ్ చేసింది.ఓసారి మా ఫ్యామిలీలో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎవరైనా ఉంటే చెప్పమన్నాం. తన ప్రేమ విషయం చెప్పింది. శ్రీసింహాను ఇష్టపడుతున్నాను అని అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటామని అడిగింది. కుటుంబమంతా ఓకే చెప్పాం. ఈ పెళ్లి వేడుకల్లో రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యుల చొరవ చూసి నాకెంతో ముచ్చటేసింది. సాధారణంగా పెళ్లి కుమార్తెను మండపం దగ్గరకు తీసుకు వచ్చేటప్పుడు ఆడపిల్లను పల్లకిలో కూర్చోపెట్టి ఆమె తరఫు బంధువులు తీసుకువస్తారు.. కానీ, మా రాగ పల్లకిని కాల భైరవ తో పాటు మిగిలిన వాళ్ళంతా మోశారు. వాళ్లందరూ రాగను తమ ఇంటి అమ్మాయిగా భావించారు. డ్యాన్సులు చేశారు. అక్కడికి వచ్చిన వాళ్లందరికీ ఎవరు ఆడపిల్ల తరఫున, ఎవరు మగపిల్లాడి తరఫు అనేది అర్థంకాలేదు. అంత ఆప్యాయంగా మమ్మల్ని చూసుకున్నారు. పెళ్లి విషయంలో మాత్రం పూర్తి నిర్ణయం నా మనవరాలు, శ్రీసింహాదే. ఈ పెళ్లి విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నా’’ అని మురళీ మోహన్ చెప్పారు.
Latest News