by Suryaa Desk | Mon, Jan 06, 2025, 01:06 PM
రామ్ చరణ్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా..దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో గత శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై చిత్రబృందానికి సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాడు. అయితే ప్రీ రిలీజ్ వేడుక అనంతరం విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ఇద్దరు రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం బైక్ పై వెళుతుండగా ఆక్సిడెంట్ అవ్వడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించడంతో పాటు బాధిత కుటుంబాలకు చెరో ఐదు లక్షల చోప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ విషయంలో సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలిసింది. తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో రామ్ చరణ్ అభిమానులు చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతి అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.
Latest News