by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:45 PM
''ఏ సినిమాలోనైనా నా స్క్రీన్ టైమ్ గురించి నేను ఆలోచించను. మనసుకి నచ్చి చేసిన పాత్రకు ఓ నటిగా వంద శాతం న్యాయం చేశామా? లేదా అని మాత్రమే ఆలోచిస్తాను.'డాకు మహారాజ్' మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా... ఇలా మిగతా పాత్రలు కూడా ముఖ్యంగానే ఉంటాయి'' అన్నారు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..'డాకు మహారాజ్' మూవీలో నందిని అనే ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశాను. చాలా ఓర్పు ఉన్న పాత్ర. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది.
నా గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం నాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పాను. ఈ మూవీలో బాలకృష్ణ, బాబీ డియోల్‌గార్లతో నటించాను. నటిగా కొత్త విషయాలు నేర్చుకున్నాను.సెట్స్ లో బాలకృష్ణ అందరితో సరదాగా ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో 'జెర్సీ' మూవీ చేశాను. ఇప్పుడు 'డాకు మహారాజ్' చేశాను. 'జెర్సీ'లో నేను చేసిన సారా, 'డాకు మహారాజ్'లోని నందిని... ఈ రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం.ఇక పదేళ్లుగా ఇండస్ట్రీలో స్థిరంగా రాణిస్తున్నాను. కేవలం ఇది లక్ మాత్రమే కాదు... నా పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఓ నటిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా పొన్నియిన్ సెల్వన్' లాంటి పీరియాడికల్ మూవీలో నటించాలని ఉంది.
Latest News