by Suryaa Desk | Fri, Dec 20, 2024, 01:36 PM
2025 ఏడాది కారు పార్టీకి కష్టాలు తప్పవా? అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయా? ఈ ఏడాది కాస్త హ్యాపీగా గడిచిపోయిందా? వచ్చే ఏడాది కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు ఇబ్బందులు తప్పవా? అవి విశ్వాసమే కేటీఆర్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? నోరు జారడం కూడా ఇందుకు కారణమా అవుననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అధికారం కోల్పోయిన తర్వాత తొలి ఏడాది బీఆర్ఎస్ పార్టీకి ప్రశాంతంగా గడిచి పోయింది. కేవలం ఢిల్లీ లిక్కర్ కేసు తప్పితే పెద్దగా ఇబ్బందులు రాలేదు. కాకపోతే నేతలు వలసపోవడం కాస్త కుంగ దీసింది. ఇప్పటికే ఆ పార్టీని మేడిగడ్డ బ్యారేజ్ అంశం, విద్యుత్ కొనుగోళ్లు వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి సంబంధించి విచారణ జోరుగా సాగుతోంది. వచ్చే నెల చివరికి నివేదిక రానుంది. దీనికితోడు ఫార్ములా ఈ -రేస్, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు వంటి కొత్త సమస్యలు తరుముకుంటూ వచ్చేశాయి. దీంతో ఏం చెయ్యాలో తెలియక తికమకపడుతున్నారు కీలక నేతలు. పదేళ్లు అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ నేతలకు అతి విశ్వాసం అమాంతంగా పెరిగిపోయింది. దాని ఫలితమే ఈ సమస్యలకు కారణం. ఈ లెక్కన కారు పార్టీ నేతలు కోరి తెచ్చుకున్న కష్టాలేనన్న మాట. ఆనాటి పాలకులు చాలా లాజిక్‌లు మిస్సయ్యారు. రాజకీయ నేతలు ఎక్కువ కాలం అధికారంలో ఉండరన్నది తొలి పాయింట్. రాజకీయాల్లో ఉంటారు.. కానీ అధికారం తక్కువ సమయంలో ఉంటారన్నది రెండోది. అధికారంలో ఉన్నప్పుడు అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూస్తున్నాం. తామే అధికారంలో ఉంటామనే అతి విశ్వాసం కూడా బీఆర్ఎస్‌ను కిందికి పడేలా చేసింది. ఒక్కోసారి తొందరపాటు చర్యలు నేతల మెడకు చుట్టు కుంటాయి. నిబంధనలు అతిక్రమించి చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. అధికారం పోయిన తర్వాత పైసమస్యలు నష్టాన్ని చేకూరుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేటీఆర్ చేసిన పనే ఇందుకు ఓ ఎగ్జాంపుల్. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని చాలామంది నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతారు. నన్నెవరు ఏం చేస్తారు.. అధికారం మా శాశ్వతం అని అనుకున్నారు. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఫార్ములా ఈ -రేస్ గురించి కేబినెట్ దృష్టికి తెస్తే సంతకాలు పెట్టకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? కేబినెట్ అప్రూవల్ అనేది ఐదు నిమిషాల పని. హెచ్ఎండీఏకు ఎలాగూ కేటీఆర్ డిపార్టుమెంట్. దానికి ఛైర్మన్ ముఖ్యమంత్రి, ఉపాధ్యక్షుడు కేటీఆర్. ఇక ఫైనాన్స్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ గురించి అప్పటి మంత్రి హరీష్‌రావు ఫోన్ చెప్పినా సరిపోయేది. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి అనుమతి ఈజీగా అయ్యేది. వీటిని కేటీఆర్ ఎందుకు ఉపయోగించులేదన్నది అసలు విషయం. అంటే దీని వెనుక ఏదో జరిగిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైపోయింది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లి పుస్తకాలు చదువుతానని ఓపెన్ గా చెప్పారు కేటీఆర్. పాదయాత్ర చేసి మళ్లీ అధికారంలోకి వస్తామని నోరు జారడం వంటివి ఒక్కోసారి వెంటాడుతాయి. ముఖ్యనేతలకు కేసులు వెంటాడడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు మిగతా నేతలు. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. కుదురుకుంటే ఓకే.. లేకుంటే అన్నీ సర్దుకుని కారు దిగే ఆలోచన కొందరున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.