by Suryaa Desk | Fri, Dec 20, 2024, 08:54 PM
ఈ దేశ సకల జనులకు సర్వహక్కులను ప్రసాదించి బాధ్యతలను అప్పజెప్పి మార్గదర్శిగా నిలిచిన అంబేద్కర్ భారతీయ సమాజానికి ఆరాధ్యుడని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరును నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటినిండా మనువాద భావజాలాన్ని నింపుకొని అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడడం ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని వారన్నారు.ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు హక్కుల పరంగా బాధ్యతల పరంగా రక్షణలను కల్పిస్తూ వారి ఎదుగుదల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సర్వోన్నతమైనదని అది జీర్ణించుకోలేని మనువాద పాలకులు కులాధిపత్య,మతాధిపత్య భావజాలాన్ని విస్తరింప చేయడానికి సమ సమానత్వాన్ని ఆకాంక్షించిన అంబేద్కర్ ని విస్మరిస్తున్నారని ఇది భారత రాజ్యాంగ ఆకాంక్షలకు వ్యతిరేకమని వారన్నారు. అసమానతలను, అస్పృశ్యతులను సృష్టించడమే పనిగా ఈ మతోన్మాద పాలకులు పెట్టుకున్నారని వారన్నారు. ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేద్కర్ ని సర్వోన్నతమైనటువంటి మేధావిధిగా కీర్తిస్తుంటే మన దేశ పాలకులు మాత్రం తులనాడుతున్నారని అవేధన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి కేంద్రమంత్రి మోడీ అమిత్ షాలు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలి.
తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ ఈ దేశ ప్రజలు జీవించడానికి కావలసినటువంటి జీవించే హక్క, స్వేచ్ఛ, సమానత్వం,సౌబ్రాతృత్వం,సామాజిక న్యాయం ఇలా అనేక రకాలైన ప్రజాస్వామిక విలువలను అందించిన మహనీయుడు అంబేద్కర్ ని "స్మరించడం" ఏ నేరం కిందికి వస్తుందో అమిత్ షా రుజువు చేయాలన్నారు. అంబేద్కర్ శాస్త్రీయమైన ఆలోచన లను అమలు చేయకుండా అశాస్త్రీయమైన మనువాద భావజాలాన్ని పదేపదే పార్లమెంట్ లో ప్రస్తావించడం అమిత్ షా అనాగరికమైన ఆలోచనలకు నిదర్శనం అన్నారు.అంబేద్కర్ ప్రచురుణలను పదేళ్లు గా ముద్రించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమే అంబేద్కర్ పట్ల వాళ్లకు ఉన్న అక్కసుకు నిదర్శనం అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అంబేడ్కర్ ఆలోచనలను విస్తరింప చేయాలనే చిత్తశుద్ధి ఈ పాలకులకు ఉంటే ఏ మేరకు అంబేద్కర్ పేరు పైన పథకాలను తీసుకొచ్చారో, ఎన్నిసార్లు అంబేడ్కర్ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించారో ఈ దేశ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా పౌర సమాజం భావిస్తుందన్నారు.తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నర్సింహా బొల్లు రవీందర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపక లక్ష్మినారాయణ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మనుపటి బిక్షం డి వి ఎఫ్ ఐజిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ వ్యాకస జిల్లా నాయకులు మన్నెం బిక్షం నాయకులు పరిపూర్ణ చారీ అద్దంకి రవీందర్ జిల్లా అంజయ్య అవుటా రవీందర్ శంకర్ శివ సైదులు తదితరులు పాల్గొన్నారు.