![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:43 PM
జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని హరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని అన్నారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ లోపల, బయట గణాంకాలతో సహా రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టి ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాడటాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆర్.ఎస్.పీ అన్నారు.మార్చి 15, 16 తేదీల్లోనే పదిహేను కేసులు పెట్టారని, రీట్వీట్ చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీలత మీద పెట్టాల్సిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ని బీఆర్ఎస్ కార్యకర్తల మీద ప్రయోగించి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.కేసీఆర్ హయాంలో 2023లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిందని, సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజలను, ప్రభుత్వ శాఖలను, కంపెనీలను కాపాడటానికి మంచి ఉద్దేశంతో ఆ బ్యూరోను ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి దీనిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరోను రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరు రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పై దృష్టి కేంద్రీకరించారని ఆరోపించారు. గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాలు సైబర్ పెట్రోలింగ్‌లో ఎందుకు లేవని ప్రశ్నించారు.రేవంత్ సైన్యం పేరిట కేటీఆర్ మీద దారుణమైన పోస్టులు పెట్టినా, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు దారుణమైన పోస్టులు పెట్టినా సైబర్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ చెబుతున్న పారదర్శకత ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంను పట్టుకొని తిరుగుతున్నారని, మరోవైపు రేవంత్ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బాధితుడు, విచారణాధికారి, జడ్జి, జైలర్, జర్నలిస్టు... ఇలా అన్ని పాత్రలను రేవంత్ రెడ్డి పోషిస్తున్నారని చురక అంటించారు.జైల్లో తనను ఘోరంగా చూశారని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి, అదే జైల్లో తనను బాగా చూసుకున్నారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. నిజానికి సైబర్ పెట్రోలింగ్ జరగాల్సింది సచివాలయంలోనే అన్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చెబితే కానీ సచివాలయంలో ఫైళ్లు కదలడం లేదని, అక్కడ సైబర్ పెట్రోలింగ్ జరగాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్రంలో ప్రతిరోజు వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నాయని, ముందు వాటి మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. నిజాయతీ గల పోలీసు అధికారులు రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిజాయతీ గల అధికారులను గుర్తించి ప్రోత్సహిస్తామని, వాళ్లకు ప్రమోషన్లు, మెడల్స్ ఇస్తామని తెలిపారు. హరీశ్ రావును పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేత మైనంపల్లిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని అన్నారు.గాంధీ భవన్‌లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని, పోలీసు అధికారులు వాటిని యథాతథంగా ఎఫ్ఐఆర్‌లుగా నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికైనా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పని చేయాలని హితవు పలికారు. లేకపోతే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.