![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:45 PM
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భద్రత పెంపునకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖుతో సిమ్లాలో సమావేశమైన ఆయన, విద్యుత్ ఒప్పందంపై చర్చించారు.ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో 'తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025' ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప ముందడుగని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ భాగస్వామ్యంతో ఆర్థికంగా లాభదాయకమైన, స్వచ్ఛమైన విద్యుత్‌ను పొందేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.థర్మల్ విద్యుత్‌తో పోలిస్తే జల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఏటా పెరుగుతుండగా, జల విద్యుత్ ఉత్పత్తి వ్యయం క్రమంగా తగ్గుతోందని ఆయన తెలిపారు.హిమాచల్ ప్రదేశ్‌లో జీవనదులు అధికంగా ఉండటం వల్ల ఏడాదిలో 9 నుంచి 10 నెలల పాటు నిరంతరాయంగా జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకు, పర్యావరణ హితమైన విద్యుత్‌ను అందించేందుకు వీలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.