|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 09:07 PM
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు ముందు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్‌ను తీసుకుంది. గత నెల 31వ తేదీన తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయగా.. తాజాగా ఆయనకు శాఖలను కేటాయిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31వ తేదీన.. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్‌కు 2 శాఖలను అప్పగించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ వంటి శాఖలను కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా మంత్రి వర్గ విస్తరణపై ఏఐసీసీలో తీవ్ర కసరత్తు జరగ్గా.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ఇటీవల ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అజారుద్దీన్‌కు అవకాశం లభించింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 15 మంది మంత్రులుగా ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే.. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజాహరుద్దీన్ ఒక్కడికి మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
అయితే రాష్ట్రంలో ఎప్పుడు కొత్త మంత్రివర్గం ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా ఒక్కరు కూడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం లేకుండా పోయింది. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆయన సిద్ధం కాగా.. హైకమాండ్ బుజ్జగించి.. ఆ సీటును నవీన్ యాదవ్‌కు అప్పగించింది.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ముస్లిం మైనార్టీల ఓట్లు కీలకం కానున్న వేళ.. ఆయనకు మంత్రి పదవిని ఇచ్చింది. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినా.. వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాననప్పటికీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.