|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:01 PM
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే, అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల్లోకి వెళితే.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇన్నోవా కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టింది. వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగి కారు మొత్తానికి వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కానీ, అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.