|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 07:13 PM
తెలంగాణలో చాలావరకు కుంటుంబాలకు రేషన్ కార్డులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా కార్డులను మంజూరు చేసింది. దీనిలో భాగంగానే.. కొత్త వారికి కూడా రేషన్ ఇస్తున్నారు. అయితే కొత్తగా కార్డు తీసుకున్నవారితో పాటు.. పాతవారు కూడా ఈ కేవైసీ చేయించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఈ విషయంపై సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి తనుజ మాట్లాడుతూజ.. రేషన్ కార్డు పొందిన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యం చేస్తే.. భవిష్యత్తులో రేషన్ కోటా పూర్తిగా తగ్గిపోవడం లేదా కార్డు రద్దు కావడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రేషన్ దుకాణాల్లోని ఈ-పోస్ యంత్రంలో కార్డు నంబరు నమోదు చేసి, లబ్ధిదారుడి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే పేరు కనిపిస్తుంది. అనంతరం వేలిముద్ర వేయగానే ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా రాష్ట్రంలోని ఏ దుకాణానికైనా వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవచ్చు.
సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 72.33 శాతం (72.33%) మంది మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 3,26,150 కార్డులు, 10,16,918 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 7,35,546 మంది మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నారు. కొత్తగా మంజూరైన 42,695 కార్డులలోని లబ్ధిదారులు కూడా వెంటనే ఈ-కేవైసీ చేయించుకోవాలని కోరారు. మొత్తంగా చూస్తే ఇంకా దాదాపు 28 శాతం మంది ఈ కేవైసీ చేయించుకోలేదని తెలుస్తోంది. ఇలానే నిర్లక్ష్యం చేస్తే వారందరి కార్డులు పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉంది. లబ్ధిదారులు తమ రేషన్ కోటాను కోల్పోకుండా ఉండాలంటే, వెంటనే ఈ-కేవైసీ చేయించుకోవడంతో పాటు, ప్రతి నెలా బియ్యాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇదిలా రేషన్ కార్డులు పొందిన వారిలో చాలా మంది పేదలు లేరని .. కొంతమంది అడ్డదారిలో కార్డులు పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనర్హుల కార్డులను రద్దు చేసి.. నిజమైన నిరుపేదలకు కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో కార్డులు పొందిన వారి డేటాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనర్హులను తొలగించి, పారదర్శకతను పెంచేందుకు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది.