|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 07:16 PM
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు (సాగర్ ఎక్స్ రోడ్డు) వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ఈటల రాజేందర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేస్తామని, దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపినట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, బీజేఎల్పీ నేత శ్రీ ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పాటిల్ తో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీతో కలిసి చర్చించిన అనంతరం ఈ శుభవార్త వెలువడింది.
కోటికి పైగా జనాభా, అటుగా వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా మారుతోంది. నగర ప్రజలు కార్యాలయాల్లో పనిచేసే సమయం కంటే ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకునే సమయమే ఎక్కువ అవుతోందని ఆవేదన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో వేగం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పరిస్థితిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఈటల రాజేందర్.. పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
కేంద్ర నిధులతో హైదరాబాద్ పరిసరాల్లో నిర్మాణమవుతున్న కొన్ని ఫ్లైఓవర్ల పనులు నత్తనడక నడుస్తున్న విషయాన్ని ఈటల రాజేందర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ జాతీయ రహదారిపై అత్యంత కీలకమైన ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కోంపల్లి ఫ్లైఓవర్ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని.. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారులు ఇచ్చిన గడువులన్నీ పూర్తయ్యాయని.. ఈ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం చొరవ తీసుకొని అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి.. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా మంజూరు చేయబోయే సాగర్ ఎక్స్ రోడ్డు ఫ్లైఓవర్ అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రస్తుతం బాలానగర్-నరసాపూర్ జాతీయ రహదారిలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో ఆ మార్గంలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. అదే సమయంలో.. నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు కొత్త జాతీయ రహదారిని నిర్మించే ప్రణాళికలు ఉన్నాయి.
ఈ రెండు ముఖ్య రహదారుల కూడలి వద్ద ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉండటాన్ని గుర్తించి.. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం అత్యవసరమని మంత్రికి వివరించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన నితిన్ గడ్కరీ.. దీని ఆవశ్యకతను గుర్తించి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రజలకు పెద్ద ఊరట.