|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 05:23 AM
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు 89వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు-2025 ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రామోజీ ఫిల్మ్ సిటీని రాష్ట్రానికి 'నాలుగో అద్భుతం'గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో రామోజీరావు దార్శనికతను, ఆయన సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ మహేశ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, రామ్ మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తదితర రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రామోజీ గ్రూప్ సంస్థలు తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. "హైదరాబాద్‌కు చారిత్రకంగా చార్మినార్, గోల్కొండ కోట వంటి అద్భుతాలు ఉన్నాయి. ఆధునిక యుగంలో హైటెక్ సిటీ మరో అద్భుతంగా నిలిచింది. ఇప్పుడు వాటి సరసన రామోజీ ఫిల్మ్ సిటీ నాలుగో అద్భుతంగా చేరింది. ఇది తెలంగాణకు దక్కిన గొప్ప ఆస్తి" అని ఆయన పేర్కొన్నారు. రామోజీ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ అవార్డులను ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలలో రామోజీ ఫిల్మ్ సిటీ పోషించిన పాత్రను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఒకప్పుడు నంది అవార్డులతో పరిమితమైన తెలుగు సినిమా, నేడు ఆస్కార్ స్థాయికి చేరిందంటే అందుకు రామోజీ ఫిల్మ్ సిటీ, ఇక్కడి స్టూడియోలు అందించిన చేయూత ఎంతో ఉంది" అని వివరించారు.ఈనాడు పత్రిక 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ, రామోజీరావు తెలుగు ప్రజల దినచర్యలో భాగమైపోయారని అన్నారు. "ప్రతిరోజూ ఉదయం ఈనాడు చదవడం, రాత్రి ఈటీవీ వార్తలు చూడటాన్ని ఆయన ఒక అలవాటుగా మార్చారు. ఇది రాజకీయ నాయకులకు సైతం ఒక వ్యసనంగా మారింది" అని తెలిపారు. తాను కూడా రోజూ ఈనాడు చదువుతానని, రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు చూస్తానని సీఎం తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. రామోజీరావు తన జీవితంలో ప్రతి రంగంలో 'నెంబర్ వన్'గా నిలవడానికి రోజుకు 18 గంటలు శ్రమించారని, ఆయన స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రేవంత్ రెడ్డి కొనియాడారు.