|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 09:47 PM
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రతి మృత వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరణితుల కుటుంబాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఉన్నత అధికారులతో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని కూడా కేబినెట్ ఆమోదించింది. బస్సు ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బాధితుల కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబం నుండి ఇద్దరిని సౌదీకి తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మరణించారు. వీరంతా హైదరాబాద్ వాసులు అని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.హైదరాబాద్‌లోని 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వీరంతా నవంబర్ 9న ఉమ్రాకు బయలుదేరారు. మక్కా యాత్ర పూర్తిచేసి మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబం నుంచి 18 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు.