|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 01:40 PM
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల భీమా విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న వేలాది బస్సులకు ఇన్సూరెన్స్ పాలసీ లేదన్న వాస్తవం బయటపడింది. అద్దె బస్సులతో సహా ఒక్క బస్సుకూ మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండానే రోజూ లక్షల మందిని తీసుకెళ్తున్నాయి. ఇది చట్టవిరుద్ధమా అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు.
వాస్తవానికి ఇది చట్టబద్ధమేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 1988 మోటార్ వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ 146 ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చెందిన వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. ఈ మినహాయింపు వల్ల ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు దశాబ్దాలుగా బస్సులకు ఇన్సూరెన్స్ చేయించకుండానే నడుపుతున్నాయి. రవాణా శాఖ అధికారులు కూడా ఈ వెసులుబాటును ధృవీకరిస్తూ, “నిబంధనల ప్రకారమే జరుగుతోంది” అని స్పష్టం చేస్తున్నారు.
అయితే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రమాదాల్లో మరణించినవారికి, గాయపడినవారికి పరిహారం ఆర్టీసీ సొంత నిధుల నుంచే చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఒక్కటే ఏటా సగటున రూ.80 కోట్ల వరకు పరిహారం ఇస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు బస్సులో అనుమతి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా కవరేజీ ఇస్తాయి, ప్రీమియం ఎలా నిర్ణయిస్తాయి అనే సాంకేతిక సమస్యల వల్ల కూడా బీమా వైపు అడుగు వేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
చేవెళ్ల ప్రమాదం తర్వాత ఈ అంశంపై ఆర్టీసీ యాజమాన్యంలో చర్చ జరుగుతోంది. అన్ని బస్సులకూ ఇన్సూరెన్స్ తీసుకుంటే రూ.60 కోట్లకు పైగా ప్రీమియం ఖర్చు అవుతుందని తెలంగాణ ఆర్టీసీ అంచనా వేసింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆర్టీసీ అధికారుల మధ్య సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత, ఆర్థిక భారం మధ్య సమతూకం కోసం ఈ చర్చ కీలకంగా మారబోతోంది.