|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 04:28 PM
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మరోసారి వర్క్ కల్చర్‌పై కీలక వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త చర్చకు తెరలేపారు. గతంలో భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పి సంచలనం సృష్టించిన ఆయన, ఈసారి చైనాలో ఒకప్పుడు అమల్లో ఉన్న '9-9-6' పని విధానాన్ని ఉదహరించారు. దేశాభివృద్ధి వేగవంతం కావాలంటే యువత ఎక్కువ గంటలు పనిచేయడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన 79 ఏళ్ల మూర్తి చైనా అనుసరించిన కఠోర పనివిధానం వల్లే ఆ దేశం ఆర్థికంగా వేగంగా పురోగమించిందని గుర్తుచేశారు. చైనా టెక్ కంపెనీలలో ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న '9-9-6' విధానం అంటే.. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి ఆరు రోజుల పాటు పనిచేయడం. అంటే, వారానికి మొత్తం 72 గంటల పని అన్నమాట.తయారీ రంగంలో భారత్ చైనాను అధిగమించగలదా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అది సాధ్యమే కానీ, అందుకు అసాధారణమైన నిబద్ధత అవసరమని స్పష్టం చేశారు. "ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే ఆరు రెట్లు పెద్దది. మనం 6.57 శాతం వృద్ధి రేటుతో పర్వాలేదనిపించినా, వారితో పోటీ పడాలంటే ప్రతి ఒక్కరూ అసాధారణంగా కృషి చేయాలి" అని ఆయన వివరించారు.