|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 04:42 PM
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ నగల దుకాణంలో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. ముఖానికి ముసుగులు ధరించి, ఆయుధాలతో దుకాణంలోకి చొరబడ్డారు. అయితే, షాపు యజమాని తన తుపాకీతో కాల్పులు జరపడంతో దొంగలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒలీవియా ఫైన్ జ్యువెలరీ స్టోర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ నెల 13న సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కొంతమంది నల్లటి దుస్తులు, ముసుగులు ధరించి స్టోర్ లోకి చొరబడ్డారు. ఒక్కసారిగా దుండగులు లోపలికి రావడంతో షాపులోని సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. దుండగుల చేతుల్లోని ఆయుధాలను చూసి చేతులెత్తేశారు. ఓ క్లర్క్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తోంది. అయితే, దుండగులను చూసిన వెంటనే వేగంగా ప్రతిస్పందించిన షాపు యజమాని.. తన లైసెన్స్ డ్ రివాల్వర్ ను తీసుకొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఊహించని ఈ ప్రతిఘటనతో దొంగలు తోకముడిచారు. ప్రాణభయంతో షాపులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనపై ఒలీవియా జ్యువెలరీ స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.