|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 10:58 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు జోష్తో స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్న ప్రభుత్వం, డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు మార్చిలోపు మురిగిపోయే అవకాశం ఉన్నందున, అప్పటిలోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి ఆ నిధులను రాబట్టడమే ప్రభుత్వ లక్ష్యం. హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్టే ఉండటంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోగా, ప్రభుత్వం 2019లో వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం తొలుత గ్రామ పంచాయతీలకు, ఆ తదుపరి పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తోంది. కాగా, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు (1,76,606 పురుషులు, 1,77,269 మహిళలు). వీరి కోసం 2,874 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు పూర్తైంది. జిల్లా యంత్రాంగం రెండు విడతలుగా ఆర్వోలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చి, సర్పంచులకు గులాబీరంగు, వార్డు సభ్యులకు తెలుపురంగు బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు సిద్ధంగా ఉంచింది.