|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 01:45 PM
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చును భరించుకోవాలని యోచిస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్‌లో అదనంగా 160 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినట్లు ఆయన వెల్లడించారు.మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రులు, అధికారుల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి ఖట్టర్ విలేకరులతో మాట్లాడారు. "మెట్రో విస్తరణ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఏ లైన్లకు ఆమోదం తెలపాలనే దానిపై మార్చి నాటికి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది" అని ఖట్టర్ స్పష్టం చేశారు.