|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 02:34 PM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరారు. ఈ డిఫెక్షన్‌ను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. కానీ రెండేళ్లు దాటినా స్పీకర్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన తర్వాత, జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పీకర్‌ను తప్పుపట్టింది. “రాజ్యాంగ బద్ధతలను ఉల్లంఘించడం ఏమిటి?” అంటూ న్యాయమూర్తులు మండిపడ్డారు. దశమ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌దే అని కోర్టు గుర్తు చేసింది.
ఇక ఓపిక అయిపోయినట్టు కోర్టు గడువు విధించింది. వచ్చే వారం రోజుల్లోగా ఈ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశించింది. లేకపోతే… “నూతన సంవత్సరాన్ని ఆయన ఎక్కడ జరుపుకుంటారో తన చేతుల్లోనే ఉంది” అని సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం రేపాయి.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వాతావరణం ఉద్ధృతంగా ఉంది. ఒకవైపు స్పీకర్ కార్యాలయం ఒత్తిడిలో పడగా, మరోవైపు ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. రాబోయే ఏడెనిమిది రోజుల్లో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అందరి చూపూ అక్కడికే…