ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా ప్రసంగించారు. పసిబిడ్డలు ఓ భాష నేర్చుకుంటున్నామని తమకు తెలియకుండానే, అనుకరణ ద్వారా, చుట్టూ ఉన్న వాళ్లను గమనించడం ద్వారా భాషను నేర్చుకుంటారని తెలిపారు. మాతృభాష ద్వారానే సృజనాత్మకత అలవడతుందని, మాతృభాషతో మమేకం అయి ముందుకు సాగడం వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయని అన్నారు. "నేనీ మాట ఎందుకు చెబుతున్నానంటే... నా మాతృభాష మరాఠీ. ఎప్పుడో 400 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని శంభాజీ సంస్థానానికి చెందిన సైనికులు విస్తరణలో భాగంగా తంజావూరు వరకు వలసలు వెళ్లారు. ఆ సమయంలో మా కుటుంబం కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడే ఆగిపోయింది. నా మాతృభాష మరాఠీ అయినా... నా చిన్నప్పటి నుంచి మా అమ్మ తెలుగులోనే మాట్లాడడంతో నేను కూడా తెలుగు నేర్చుకున్నాను. నా మాతృభాష మరాఠీ అయినప్పటికీ, నేను మరాఠీ మాట్లాడగలిగినప్పటికీ... నాకు తెలుగే అబ్బింది. ఎందుకంటే... నా ఆలోచన తెలుగులోనే ఉంటుంది. నేను మరాఠీతో పాటు కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీషు కూడా మాట్లాడగలిగినప్పటికీ... నేను ఆలోచించేది తెలుగులోనే, నా భావ వ్యవక్తీకరణ తెలుగులోనే ఉంటుంది. మిగతా భాషల్లో మాట్లాడాలంటే కూడబలుక్కుని మాట్లాడాల్సి ఉంటుంది" అని సత్యకుమార్ వివరించారు.