మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గోడౌన్ నుంచి బియ్యం మాయం కావడంపై మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి స్పందించారు. పేర్ని నానిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల బియ్యం స్వాహా చేసి నీతి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. చోరీ చేసి డబ్బు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన దొర అయిపోరని, దొంగ దొంగే అని వ్యాఖ్యానించారు. భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. భార్య పేరుతో గోడౌన్ ఉంటే, జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. బియ్యం దొంగ పేర్ని నాని చట్టం నుంచి తప్పించుకోలేరని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామని తెలిపారు. పోర్టు సమీపంలోని ప్రజల భూములను లాక్కోవడం వాస్తవం కాదా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.