పుత్తూరు- అత్తిపట్టు మధ్య రైల్వే లైను రూట్ మ్యాప్ ప్రాజెక్టు సిద్ధమైంది. 88.30 కిలోమీటర్లు.. సింగిల్ విద్యుత్ లైను మార్గంలో ఎనిమిది స్టేషన్లను ప్రతిపాదించారు. జిల్లాలో నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం.. తమిళనాడులో ఊత్తుకోట, పాలవ్కాకం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పుత్తూరు రైల్వే స్టేషన్ నుంచి నారాయణవనం మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండగా.. మిగిలిన స్టేషన్లు పది కిలోమీటర్ల వంతున ఉన్నాయి.పర్యాటక కేంద్రమైన కైలాసనాథకోనను దృష్టిలో ఉంచుకుని కృష్ణమరాజుకండ్రిగను కూడా స్టేషన్‌గా ప్రతిపాదించారు. ఇక, పుత్తూరు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో అంటే నారాయణవనం రైల్వే గేటు- మరాఠీ రైల్వే గేట్ల మధ్య ఈ కొత్త రైల్వే లైను తిరుగుతుందని పేర్కొన్నారు. ఈ రైల్వే మార్గంలో 15 మేజర్.. 159 మైనర్ వంతెనలు ఉంటాయని ప్రతిపాదించారు. ప్రతిరోజు ప్రయాణికుల కోసం ఆరు బోగీలు వుండే నాలుగు ఈఎంయులు నాలుగు ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ విద్యుత్ రైళ్లు ఇటు పుత్తూరు- చెన్నై, అటు సూళ్లూరుపేట-చెన్నై లైన్లలో కలుస్తాయి. దీంతో శ్రీసిటీ వెళ్లే ఉద్యోగులు, చెన్నై, పుత్తూరు వెళ్లే వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.