అసలు నోట్లకు దొంగ నోట్లు అధిక మొత్తంలో ఇస్తామని మోసగిస్తున్న ఒక ముఠాను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో భీమ డోలు సీఐ యుజె విల్సన్, ద్వారకాతిరుమల ఎస్‌ఐ పి.సుధీర్ వారి సిబ్బంది కలిసి ముఠా లోని ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నింది తుడు పరీరాలో ఉన్నాడు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమలలో ఒక వ్యక్తివద్ద నుంచి రెండున్నర లక్షల అసలు నోట్లను తీసుకుని 15 లక్షల దొంగ నోట్లను ఒక ముఠా మార్చుకుంటుందని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కోడూరి రవి తేజ (28) ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో ఉంటూ దొంగ నోట్ల మార్పిడి ముఠాను తయారు చేశాడు. జంగారెడ్డి గూడెం పద్మాథియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ నాగూర్‌మీరావలి (25) జంగా రెడ్డి గూడెం మసీదు సెంటర్‌కు చెందిన వీరంకి రాజేశ్ (28)లతో రవితేజ ముఠా ఏర్పాటు చేసుకున్నారు. నాగూర్‌మీరావలి, వీరంకి రాజేష్‌లు 15 లక్షల రూపాయల నకిలీ నోట్లను తీసుకుని గురువారం ద్వారకాతిరుమలలో రోడ్డుపక్కన హోటల్ నడుపుకుంటూ జీవించే కొల్లు సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ (40) వద్దకు వెళ్ళి డబ్బులు మార్పిడి చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి అసలైన నోట్లు రెండున్నర లక్షల రూపాయలు, నకిలీ నోట్లు (500రూపాయలు) 15 లక్షల రూపాయలు, ఒక మోటారు సైకిల్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.