డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఖరీదైన బైక్ మీద వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ బైక్ ధర ఇంతంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఏంటి..? అందులో ఎంత వరకు నిజముందో చూద్దాం..!
క్లెయిమ్ ఏమిటి?
డ్రగ్స్‌పై ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాని ఖరీదు సుమారు రూ.70 లక్షలు అని రోహిత్ సింగ్ (X/RohitSi70785609) అనే యూజర్.. అనురాగ్ ఠాకూర్ బైక్ మీద వెళ్తున్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
అనురాగ్ ఠాకూర్ నడిపిన బైక్ ధర రూ.70 లక్షలు అని పేర్కొంటూ ఇదే వీడియోను చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
రూ.70 లక్షల విలువైన బైక్ మీద అనురాగ్ ఠాకూర్ దేశ ప్రజలను టీజ్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా యాసర్ షా (X/yasarshah_SP) అనే యూజర్ ఎక్స్‌లో వీడియోను పోస్టు చేశారు.
‘రూ.70 లక్షల ఖరీదైన బైక్ మీద ఆయన రీల్స్ చేస్తున్నారు. ఆయన పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు’ అనే అర్థం వచ్చేలా హిందీ రాసిన క్యాప్షన్‌తో రాగా ఫర్ ఇండియా (X/RaGa4India) అనే యూజర్ ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ బైక్ నడుపుతోన్న వీడియోను షేర్ చేశారు.
వాస్తవమేంటి?
వైరల్ అవుతోన్న వీడియో నిజమా? కాదా అని తెలుసుకోవడానికి సజగ్ టీమ్ ముందుగా ప్రయత్నించింది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించినట్లు.. ఇందులో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పాల్గొన్నారని సజగ్ టీమ్ గుర్తించింది. 93.5 రెడ్ ఎఫ్ఎం నిర్వహించిన బైక్ ర్యాలీలో తాను పాల్గొన్న విషయాన్ని అనురాగ్ ఠాకూర్ స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గతంలోనూ అనేక ర్యాలీల్లో ఠాకూర్ పాల్గొన్నారు. ‘డ్రగ్ ఫ్రీ, సేఫ్టీ యుక్త్’ పేరిట హమిర్‌పూర్, ఉనా, ఘుమార్విన్ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.
ఇక వైరల్ అవుతోన్న వీడియోలో ఉన్న బైక్ ఖరీదు నిజంగా రూ.70 లక్షలా? అనే విషయం తెలుసుకోవడానికి సజగ్ టీమ్ ప్రయత్నించింది. ర్యాలీలో అనురాగ్ ఠాకూర్ హార్లీ డేవిడ్‌సన్ రోడ్ గ్లైడ్ బైక్‌ను నడిపారు. బైక్‌వాలే వెబ్‌సైట్ ప్రకారం.. ఢిల్లీలో ఈ బైక్ ఆన్‌రోడ్ ధర రూ.47 లక్షలుగా ఉంది. అదే హైదరాబాద్‌లోనైతే ఆన్‌రోడ్ ధర రూ.48.51 లక్షలుగా ఉంది.
అసలు వాస్తవం ఇది
అనురాగ్ ఠాకూర్ బైక్ నడిపిన విషయం నిజమే కానీ.. ఆయన నడిపిన బైక్ ధరను ఎక్కువ చేసి చూపుతున్నారని సజగ్ టీమ్ గుర్తించింది. దీన్ని బట్టి సోషల్ మీడియా క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉందని తేల్చింది.