ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ సంక్రాంతి పండుగకు సరికొత్త నిర్వచనం తీసుకువచ్చారని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సంక్రాంతి వేడుకల్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసి భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతి సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్రాంతికి కొత్త నిర్వచనం తీసుకువచ్చారని దుయ్యబట్టారు. నారావారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు, గుండాటలు జరిగాయన్నారు.