కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల (జనవరి) 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. దాదాపు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ. దీంతో పెద్ద సంఖ్యలతో భక్తులు తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏడురోజులుగా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. లక్షల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.మరో మూడు రోజుల పాటు ఈ దర్శనాలు కొనసాగనున్నాయి. ఈనెల 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమలలో అన్ని సేవలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సామాన్య భక్తులకే స్వామి వారి దర్శనం కల్పించేలా ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. కాగా.. ఈనెల19తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. శ్రీవారి సర్వదర్శనాల తేదీ ఎప్పుడో ప్రకటించిన టీటీడీ... అందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని సర్వదర్శనాలపై చర్చలు జరిపారు.ఈనెల 19తో వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ముగియనుంది. ఈనెల 20న స్వామి వారి సర్వదర్శం కోసం వచ్చే భక్తులకు 19న ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేయరని.. వారు సర్వదర్శనం క్యూలైన్‌లలో నేరుగా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ఈవో వెల్లడించారు. అలాగే 19న ఆన్‌లైన్‌లో కూడా శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయరని తెలిపారు. అలాగే 20న ప్రోటోకాల్ భక్తలకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనం కూడా రద్దు చేశామని.. ఈ నేపథ్యంలో 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సులను స్వీకరించబోమని టీటీడీ ఈవో శ్యామలారావు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 21 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్‌ని ఏ రోజుకు ఆ రోజూ జారీ చేయనున్నారు.