ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలపై హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం తెలియదా అంటూ మండిపడ్డారు. హామీలన్నీ తొంగలో తొక్కారని విమర్శించారు. " ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమన్నారు. ‘‘చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ? రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసం ? ’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిపంచారు.