ఆఫ్రికా దేశం అయిన సుడాన్‌లో రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, సుడాన్ సాయుధ దళాలు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఆర్ఎస్ఎఫ్ బలగాలు.. సుడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో దాదాపు 114 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2023 ఏప్రిల్ నెలలో సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అర్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ఎస్ఎస్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య అధికార పోరాటం జరిగింది. ఇది కాస్తా 2024 మే 10వ తేదీ నుంచి యుద్ధం రూపంలోకి మారింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకు రావాలనే ఆశలను అణగదొక్కింది. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా డార్ఫర్ వంటి ప్రాంతాలపై పెద్ద ఎత్తున దాడులు జరగ్గా.. భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఖార్టూమ్‌లో సైన్యం చేసిన కొత్త దాడులతో ఆర్ఎస్ఎఫ్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.
ఈక్రమంలోనే జామ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం రోజు ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఇష్టం వచ్చినట్లుగా అందరిపై కాల్పులు జరిపాయి. దీంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 9 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు. అలాగే శనివారం రోజు అబుషాక్ శిబిరంపై జరిపిన దాడుల్లో మరో 14 మంది చనిపోయినట్లు వివరించారు. ఈ ఘటనలోనూ అనేక మంది గాయపడినట్లలు పేర్కొన్నారు.
అయితే ఈ శిబిరంపై జరిగిన దాడిలో మొత్తంగా 40 మందికి పైగానే ప్రజలు చనిపోయారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి బలగాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఐక్యరాజ్య సమితి ఉదహరించిన సంక్షోభ పర్యవేక్షణ సమూహం అయిన ఆర్మ్డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు 29, 600 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అలాగే ఇప్పటికీ ఎస్ఏఎఫ్ మరియు ఆఎస్ఎఫ్ మధ్య యుద్ధం కొనసాగుతోందని స్పష్టం చేసింది.
![]() |
![]() |