by Suryaa Desk | Fri, Dec 27, 2024, 03:43 PM
బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. కానీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా? అని ప్రశ్నించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. బీసీల జనాభా ఎంతో తెలియకుండానే హామీ ఎలా ఇచ్చారని నిలదీశారు. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని, మరి 42 శాతం రిజర్వేషన్ ఇస్తే ఎలా? అన్నారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని హెచ్చరించారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామన్నారు.కనీసం ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అయినా ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. లేదంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు ఆగాలన్నారు. బీసీ జనాభా ఎంతో వెల్లడించాకే ఎన్నికలపై ఆలోచన చేయాలని సూచించారు. బీసీలకు బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు.