|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 07:09 PM
సమాజంలో గత కొంత కాలంగా.. పెళ్లై, బిడ్డలున్న వారు సైతం.. మరో వ్యక్తిని ప్రేమిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రియుడితో కలిసి ఉండటం కోసం కొందరు వివాహితలు భర్త, పిల్లలను చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. మేఘాలయ హనీమూన్ ఘటన తర్వాత.. భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని తెలిశాక. భర్తే దగ్గరుండి భార్యకు ఆమె ప్రియుడితో వివాహం చేసిన సంఘటనలు కూడా బయటకొచ్చాయి. తాజాగా ఖమ్మంలో ఇదే తరహా సంఘటన వెలుగు చూసింది. భార్య మరో వ్యక్తిని ప్రేమించింది అని తెలుసుకున్న భర్త.. వారిద్దరికి వివాహం చేశాడు. ఆ తర్వాత అతడు చేసిన పని వల్ల తీవ్ర విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. దగ్గరుండి మరీ భార్యకు ఆమె ప్రేమించిన వాడితో వివాహం చేశాడు. అంత వరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ వ్యక్తి.. ఇంటికెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తికి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా, ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ పోషణ కోసం అతడు సత్తుపల్లి పట్టణం దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లి ఆటో నడిపేవాడు. అలా వచ్చిన డబ్బులతో భార్యాబిడ్డలను పోషించేవాడు. ఇదిలా ఉండగా గౌస్ భార్యకు అతడి స్నేహితుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత గౌస్‌కు తన భార్య ప్రేమ విషయం తెలిసింది. దీంతో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తన భార్యకు, ఆమె ప్రేమించిన వ్యక్తికి పెళ్లి చేయాలని భావించాడు. ఈ విషయం భార్యకు చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. దీంతో కొన్ని రోజుల క్రితమే భార్యకు, ఆమె ప్రియుడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించాడు గౌస్. ఆ తర్వాత అతడు సత్తుపల్లిలోని తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకోవటం.. తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో పాపం ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. గొప్ప మనసుతో భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన గౌస్.. తన బిడ్డల గురించి మాత్రం ఆలోచించలేకపోయాడు. అతడు తీసుకున్న నిర్ణయం వల్ల పాపం అభం శుభం తెలియని పిల్లలు అనాథలుగా మిగిలారు. బిడ్డల కోసమైనా గౌస్ బతికుండాల్సింది అంటున్నారు గ్రామస్తులు. అయితే కుటుంబ కలహాల వల్లే గౌస్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గౌస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.