|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 04:22 PM
మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయన వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ. 1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, మావోయిస్టులు అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. వారి మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సలైట్లు కారణమని అన్నారు.అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులని ఆయన మండిపడ్డారు. నక్సలైట్లు ఇప్పటికైనా తుపాకీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి మరో నాలుగు నెలల గడువు మాత్రమే ఉందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు.