|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:51 PM
ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని గడ్డపోతారంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా, అదుపుతప్పి కింద పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులతో పాటు మిగిలిన వారిని చికిత్స నిమిత్తం పటాన్ చెరు ఆసుపత్రికి తరలించారు.సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో జరిగిన ఈ భీకర ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి సర్వీస్ రోడ్డుపైకి ఎగిరిపడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన ముగించుకుని ఆరుగురు ప్రయాణికులు కారులో బాచుపల్లి వైపు వెళ్తున్నారు. పోచారం గ్రామ సమీపంలోకి రాగానే, కారు అత్యంత వేగంగా ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి, గాల్లోకి ఎగురుతూ ఓఆర్‌ఆర్ పైనుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడింది.ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.