|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:54 PM
మా చెరువులో మురుగు నీరు వచ్చి చేరుతోంది.. దుర్గంధభరిత వాతావరణంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. గుర్రపు డెక్కపెరిగి దోమలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాం. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా కిటికీలు, తలుపులు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి. మా చెరువుల్లో మురుగు నీరు కలవకుండా చూడండి.. మా చెరువులను కూడా అభివృద్ధి చేయండి`` అంటూ పలువురు శనివారం ఫోన్ - ఇన్ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారితో నగర ప్రజలు విన్నవించుకున్నారు. ప్రతి సోమవారంహైడ్రా ప్రజావాణికి అదనంగా శనివారం నాడు ఫోన్ - ఇన్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమని అభినందించారు. హైడ్రా కార్యాలయం వరకూ రాలేనివారు.. సమస్యలను ఫోనులో చెప్పుకునే అవకాశం ఇవ్వడం సంతోషమన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ జరిగిన ఫోన్-ఇన్ కార్యక్రమంలో నేరుగా కమిషనర్ ఫిర్యాదుదారులతో మాట్లాడారు. వారి సమస్యలను విని.. పరిష్కారానికి సంబంధిత అధికారి వివరాలను అందజేశారు. వారం తర్వాత పరిష్కారం కాకుంటే నేరుగా తనకు ఫోను చేయాలని ఫిర్యాదుదారులను కోరారు. సెలవు రోజుల్లో మినహా.. ప్రతి శనివారం 040-29565750, 040-29565759 ఈ నంబర్లకు ఫోను చేసి సమస్యలను తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాల నుంచి కూడా కొన్ని ఫోన్లు వచ్చాయి. అక్కడ కూడా చెరువులు ఆక్రమణలకు గురౌతున్నాయని.. వాటిని కాపాడాలని పలువురు కోరారు. ఓఆర్ ఆర్ వరకే హైడ్రా పరిధి అంటూ.. వారికి కమిషనర్ సర్ది చెప్పారు. మొదటి విడత 6 చెరువులు చేపట్టగా.. త్వరలోనే 14 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇలా దశలవారీ చెరువులను అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ వారికి తెలిపారు.