|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:11 PM
రేవంత్ ఎప్పటికైనా బీజేపీ మనిషేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. రేవంత్ కాంగ్రెస్ నేత కాదు బడే భాయ్ తమ్ముడు. కాంగ్రెస్ నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్లే వారికి ఓటేయాలి. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఆయన విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో దూరారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అధికారంలో ఉన్నామని, వారికే ఓటు వేయాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని... మరి రెండేళ్లలో వారి ప్రభుత్వం ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. మరో రెండేళ్ల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఖచ్చితంగా పట్టణాలను కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని అన్నారు.మైనారిటీలకు, బీసీలకి భారీ ఎత్తున బడ్జెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు అయితే... ఆ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే వారికి ఓటు వేయాలని అన్నారు. మిగిలిన వాళ్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పెన్షన్ రూ. 4000, మహిళలకు రూ. 2,500, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వచ్చిన వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.