కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి తరలివస్తున్నారు. కాగా నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, అనంతరం మూల విరాట్‌కు చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం వేకువ జామున 3 గంటలకే స్వామి దర్శనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.150 దర్శన కూలైన్లను ఏర్పాటు చేసినట్లు చేశామని, భక్తుల కోసం 8 వేల పెద్దలడ్డూలు, 80 వేల చిన్న లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నట్లు ఈవో పెంచలకిషోర్ వెల్లడించారు.