ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 12:10 PM

 రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390 కి.మీ ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. గతంలోనే పామర్రు-ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి-165 విస్తరణ మంజూరైంది. ఇందులో పామర్రు-ఆకివీడు మధ్య 64 కి.మీ. రెండు వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్‌ వివాదం నెలకొంది. భీమవరానికి ఎడమవైపు వెళ్లేలా 18 కి.మీ.మేర బైపాస్‌తో ఎలైన్‌మెంట్‌ను తొలుత ఖరారు చేయగా, కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్‌ భాగమే కాకుండా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. ఎన్‌హెచ్‌ వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా రూ.వెయ్యి కోట్లు మంజూరవుతున్నా.. ఎలైన్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో ఇప్పటివరకు పురోగతి లేకుండా పోయింది. తాజాగా భీమవరం వద్ద బైపాస్‌ను కుడివైపు (గొల్లవానితిప్ప వైపు) నిర్మించేలా ఎలైన్‌మెంట్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com