|
|
by Suryaa Desk | Sat, Dec 21, 2024, 07:05 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నారు. అయితే.. అందులో కారణాలను కూడా రేవంత్ రెడ్డి వివరించారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోవటానికి ప్రధాన కారణం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతు భరోసాపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ తలచుకుంటే రాష్ట్రానికి ఉన్న రూ.7 లక్షల కోట్ల అప్పు కట్టేయగలదంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కదాన్ని.. వ్యాపారంగానే మార్చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ.. రైతుల వడ్డీలకే సరిపోయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల భారంతో తమకు అప్పగించినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. 16 మంది ముఖ్యమంత్రులు కలిసి రూ.72 వేల కోట్ల అప్పులు చేసి.. అనేక ప్రాజెక్టులు చేపడితే.. గత పదేళ్ల కాలంలోనే లక్షల కోట్ల అప్పులు చేసి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందంటూ ఎద్దేవా చేశారు. తీరా చూస్తే.. ఆ ప్రాజెక్టు ద్వారా కొత్తగా కేవలం 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వాళ్లు చేసిన అప్పుల వల్లే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ఈ అప్పే లేకపోతే అద్భుతాలు సృష్టించే వాళ్లమని చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోవడానికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో.. సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.