![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 01:59 PM
అమెరికాలో చదువుకుంటున్న కొందరు విదేశీ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ కార్యాలయం నుంచి ఈమెయిల్ అందింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ పేరుతో ఈ ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని అధికారులు అందులో హెచ్చరించారు. క్యాంపస్ లలో జరిగే ఆందోళనలలో పాల్గొనడం లేదా ఆ ఆందోళనలకు సంబంధించిన చిత్రాలను తమ సోషల్ మీడియా ఖాతాలలో పంచుకోవడమే వారు చేసిన తప్పిదంగా తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు, భారతదేశంలోని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం అమెరికాలోని విదేశీ విద్యార్థుల భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు విధిస్తుందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగశాఖ కొంతకాలంగా పరిశీలిస్తోంది. అనుమానాస్పదమైన చిత్రాలు లేదా వ్యాఖ్యలు ఉన్న ఖాతాలకు వెంటనే ఈమెయిల్ పంపిస్తోంది.