![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:42 AM
జన్యుపరమైన కారణాలతో గుండెపోటుకు గురయ్యే ప్రమాదాన్ని దాదాపు పూర్తిగా నివారించే సరికొత్త ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లెపొడిజిరాన్ అనే ఈ మందును టీకా రూపంలో ఏడాదికి ఒకసారి తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరవని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మందు వినియోగం ఎంతవరకు సురక్షితమనే దానిపై తుది పరీక్షలు జరుగుతున్నాయని, దీనివల్ల పెద్దగా దుష్ప్రభావాలు కూడా లేవని తేలిందని వారు వివరించారు. వంశపారంపర్యంగా వచ్చే గుండె జబ్బుల ముప్పు ఈ ఔషధం ద్వారా 94 శాతం తగ్గుతుందని, అదేవిధంగా పక్షవాతం ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ ఈ మందును తయారు చేస్తోంది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇటీవల షికాగో యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో లెపొడిజిరాన్ ఔషధం పనితీరును శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి.