|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:43 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం నుంచే కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియడంతో, అధికారులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేశారు. ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లు తెరుచుకోవని అధికారులు స్పష్టం చేశారు. మళ్లీ నవంబర్ 14న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.