|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:47 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌పైనా, మాజీ మంత్రి హరీశ్‌రావుపైనా సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. "నేనూ తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటా కానీ, అవమానాన్ని మాత్రం తట్టుకోను" అని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... 20 ఏళ్లు పార్టీలో పనిచేస్తే ఇలా అవమానించి బయటకు పంపించారని కవిత వాపోయారు. ఉద్యమ సమయంలో బతుకమ్మ పేరుతో పల్లెపల్లె తిరిగిన తనను, ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రొటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే పరిమితం చేశారని అన్నారు. బీఆర్ఎస్‌లో తనకు ఎవరితోనూ గొడవలు లేకపోయినా, కుటుంబం నుంచే తనను బయటకు పంపారని తెలిపారు. ఇకపై బీఆర్ఎస్‌తో తనకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని, కేసీఆర్‌ను కేవలం కూతురిగా మాత్రమే కలుస్తానని తేల్చిచెప్పారు.